నగరంలో ముసుగు దొంగల ఆగడాలు
హైదరాబాద్ మహానగరంలో దొంగల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలలో, విల్లాలలో సైతం రక్షణ కరువయ్యింది. తాజాగా శంషాబాద్‌లోని సాతంరాయిలో ముసుగుదొంగలు కలకలం రేపారు. సుచిరిండియా విల్లాలలో నిన్న ఉదయం ఏకంగా 3 విల్లాలలో దోపిడీకి తెగబడ్డారు. దొంగలు ఇంటి తలుపులకు ఉన్న గడియలు కోసేసి మరీ లోనికి ప్రవేశించారు. యజమానులకు దొంగలు ఇంట్లో చొరబడింది కూడా తెలియలేదు. నిశ్శబ్దంగా వారి పని వారు చేసుకుపోయారు. బీరువాలలో డబ్బు దొంగిలించారు. ఉదయం లేచిన ఇంటి యజమానులు తలుపుల గడియలు కోసేసి ఉండడంతో దొంగతనం జరిగిందని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితుల్లో కేరళ కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన ఇంట్లో 60 వేలు డబ్బు పోయింది. మరో రెండు ఇళ్లలో 30 వేలు, 10 వేలు దొంగతనం జరిగింది. ఐతే దొంగలు వెండి వస్తువులు, ఫోన్‌లు, లాప్‌టాప్‌ల జోలికి పోలేదు. సీసీ టీవీ ఫుటేజీల ప్రకారం వారు అర్ధరాత్రి 2 గంటలకు వచ్చినట్లు సుమారు 4 వరకు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దొంగలు తీరిగ్గా ఫ్రిజ్‌లో పండ్లను కూడా తిన్నట్లు గుర్తించారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. విల్లాల గురించి బాగా తెలిసినవారే ఈపని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. విల్లాలకు ముందు భాగంలో ఉన్న ఫెన్సింగ్‌ను కోసేసిన దుండగులు లోపలికి చొరబడి విల్లాల వెనుక భాగంలో ఉన్న తలుపులను గ్యాస్ కట్టర్లతో తొలగించారు. ముసుగు వేసుకోవడం వల్ల సీసీ ఫుటేజ్‌లో వారిని గుర్తించలేకపోయారు. సమీపంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరిని అనుమానంతో పోలీసులు విచారిస్తున్నారు.