Andhra PradeshHome Page Slider

మన్యం వీరుడు అల్లూరి 125 వజయంతి

భరతజాతి మరిచిపోలేని స్వాతంత్య్ర సమరయోధులలో అగ్రగణ్యుడు అల్లూరి సీతారామరాజు. అత్యంత ధైర్యసాహసాలతో బ్రిటిష్ వారిని ఎదురొడ్డి నిల్చిన మన్యం వీరుడు సీతారామరాజు జయంతి నేడు. ఈయన 1897వ సంవత్సరం జూలై 4న జన్మించారు. ఆయుధం ద్వారానే స్వతంత్య్రం  వస్తుందని నమ్మి విప్లవ శంఖం పూరించాడు. అమాయక గిరిజన ప్రాంత వాసులలో చైతన్యం తీసుకొచ్చి వారిని ఆంగ్లేయులపైకి ఉసిగొల్పిన విప్లవజ్యోతి సీతారామరాజు. రామరాజు పూర్వికులు తూర్పుగోదావరి జిల్లా కోమటి లంకలో ఉండేవారు. అనంతరం అనేక గ్రామాలలో వలసలు చెంది వీరి కుటుంబం విశాఖకు చేరింది. చదువుపై అనాసక్తి కారణంగా సరిగ్గా చదవని రామరాజు తునిలో తల్లి దగ్గర చేరి చుట్టుపక్కల కొండలు, గిరిజనుల జీవితాన్ని గమనించేవారు. ఆయనలో చిన్ననాటి నుండి దైవభక్తి, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండేవి. కొంతకాలం తపస్సు కూడా చేశారు. అనంతరం 1916 నుండి  ఉత్తర భారత దేశ యాత్రకు వెళ్లి కొన్నేళ్లు గడిపారు. ఈ సమయంలోనే తెల్లదొరల దురాగతాలు తెలుసుకున్నారు. గిరిజనులను బ్రిటిష్ అధికారులు ఎంతమోసం చేసేవారో తెలుసుకున్నారు. భారతదేశంలో స్వతంత్రోద్యమం గురించి తెలుసుకుని హింసాత్మక మార్గంలోనే స్వాతంత్య్రం సాధించగలమని నమ్మారు సీతారామరాజు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో గిరిజనులకు అండగా ఉంటూ బ్రిటిష్ అధికారులపై దాడులు చేసేవారు. పోలీస్ స్టేషన్లపై మెరుపుదాడులు చేసి వారివద్ద గల తుపాకులు స్వాధీనం చేసుకుని సాయుధపోరాటం సాగించేవారు. ప్రజలను పన్నుల కోసం పీడించే కలెక్టర్లను, తాసీల్దారులను బెదిరించి, భయపెట్టి వారికి సింహస్వప్నం అయ్యారు.

చివరికి బ్రిటిష్ ప్రభుత్వానికి మరో దారి లేక అతన్ని పట్టించిన వారికి పదివేల రూపాయల బహుమతి ప్రకటించింది. రాజును పట్టించి ఇమ్మంటూ అక్కడి గిరిజనులను చిత్రహింసలు పెట్టసాగారు దుర్మార్గుడైన మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్. దీనితో ప్రజలను కష్టపెట్టడం ఇష్టంలేక తనంతట తానుగా లొంగిపోయిన త్యాగశీలి సీతారామరాజు. చివరకు 1924 మే 7న నిరాయుధుడైన సీతారామరాజును చెట్టుకు కట్టి ఏ విచారణ లేకుండా నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపాడు మేజర్ గుడాల్. అయితే అంతవరకూ ఆయనను తీవ్రవాదిగా పేర్కొన్న పత్రికలు ఆయన మరణానంతరం సీతారామరాజు జాతీయనాయకునిగా, ఆంధ్ర శివాజీగా, రాణా ప్రతాప్‌గా పోలుస్తూ కీర్తించాయి. 

1929లో మహాత్మాగాంధీ ఆంధ్ర పర్యటనలో ఆయనకు తెలుగువారు అల్లూరి సీతారామరాజు పటాన్ని బహుకరించారు. మహాత్మాగాంధీ అల్లూరి గురించి మాట్లాడుతూ శ్రీ రామరాజు నుండి అకుంఠిత సాహసం, కార్యదీక్ష, సచ్చీలము అందరూ నేర్చుకోవాలన్నారు. సాయుధపోరాటం పట్ల తనకు సానుకూలత లేకపోయినా ధైర్యవంతుడైన, ఉన్నతవ్యక్తిగా సీతారామరాజు పట్ల చాలా గౌరవం ఉందన్నారు. ఆయన తిరుగుబాటుదారు కాదు, గిరిజనులకు హీరో అని పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అభిప్రాయం ప్రకారం భారతీయ యువకులు సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన జాతీయోద్యమానికి చేసిన సేవ మరువలేనిదని కొనియాడారు. సీతారామరాజు జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1986లో తపాలాబిళ్లను విడుదల చేసింది.నేడు అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల ముగింపుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ వేడుకలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు జరగబోతున్నాయి.