గవర్నర్‌పై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు టిఫిన్ డబ్బులు నేనిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి, గవర్నర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ మధ్య కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రమాణ స్వీకార సమయంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని గవర్నర్ ఆరోపించారు. వారు అసెంబ్లీ కార్యక్రమాలలో పాల్గొనడానికి, ఓటింగ్ చేయడానికి రోజుకు రూ.500 జరిమానాగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో మమత బెనర్జీ మండిపడ్డారు. నీట్ కుంభకోణం నేరస్తులకు కూడా విధించని జరిమానాను శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు గవర్నర్ విధిస్తున్నారని, మీకు టిఫిన్‌కు డబ్బులు లేకపోతే నేను ఏర్పాటు చేస్తానని గవర్నర్‌పై విరుచుకుపడ్డారు. అసలు విషయమేమిటంటే ఉప ఎన్నికలలో గెలుపొందిన రేయాత్ హుసేన్ సర్కార్, సయంతికా బెనర్జీలతో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించాలని అనుకున్నారు గవర్నర్. అనంతరం మనసు మార్చుకుని ఈ బాధ్యత డిప్యూటీ స్పీకర్ ఆశీష్ బెనర్జీకి అప్పగించారు. అయితే ఈ సమయంలో స్పీకర్ బిమన్ బెనర్జీ సభలో ఉండడంతో ఈ కార్యక్రమం ఆయన నిర్వహించారు. అయితే తాను డిప్యూటీ స్పీకర్‌కు అప్పగించిన పనిని, స్పీకర్ చేత చేయించడంతో గవర్నర్ ఆనంద్ బోస్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ విషయంపైనే ముఖ్యమంత్రి మమతకు, గవర్నర్‌కు వాదోపవాదాలు జరిగాయి.

