కాసినో కింగ్స్‌కు బడాబాబుల అండ
హైదరాబాద్‌లో నిన్న జరిగిన ఈడీ దాడులు తెలుగు రాష్ట్రాలలోనూ ప్రకంపనలు కలిగిస్తున్నాయి. గుడివాడలో బయటపడిన క్యాసినో వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. జూదం పేరుతో నిధులు మళ్లిస్తున్నారనే సమాచారంతో పలువురు టూర్ ఆపరేటర్లపై ఈడీ వరుసగా సోదాలు నిర్వహించింది. గోవాలో క్యాసినోలు నిర్వహించడంతోపాటు నేపాల్, థాయ్‌లాండ్‌లలో జరిగే జూదంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డి సహా కొందరు ప్రత్యేక టూర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. రానుపోను ఖర్చులతో కలిపి 5 రోజులపాటు విదేశాల్లో ఉండేందుకు ఒక్కొక్కరి నుంచి దాదాపు 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. గతంలో ఎక్కువ మందిని శ్రీలంక తీసుకెళ్లేవారని, ఇప్పుడు అక్కడి పరిస్థితులు బాగోకపోవడంతో నేపాల్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. ప్రవీణ్ రెగ్యులర్ కస్టమర్లు 200 మంది ఉంటారని అంచనా.

ఈ టూర్లను నిర్వహించే కార్యాలయాలపై ఈడీ దాడులు జరుగుతున్నట్లు తెలియగానే కొందరు బడా వ్యాపారులు, అధికారులు, రాజకీయనాయకులకు భయం పట్టుకుందని సమాచారం. జూదం ఆడేందుకు దొంగదారిలో సొమ్ము విదేశాలకు తీసుకెళ్తున్నారని, గెలుచుకున్న డబ్బును కూడా దొంగదారిలోనే స్వదేశానికి తీసుకువస్తున్నారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ టూర్‌ల పేరుతో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు సమాచారం. కోల్‌కతా మీదుగా నేపాల్‌కు కస్టమర్లను చేరవేసేవారని సమాచారం. ఒక్కో దేశానికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని, ఒక్కో విమానానికి 50లక్షలు చెల్లింపు చేసేవారని, ఒక్కోసారి హోటల్‌కు 40లక్షలు చెల్లించేవారని తెలిసింది. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌లో అడ్డాలుగా చీకటి వ్యాపారం నడుపుతున్నారని తెలిసింది. ఇంతేకాక ప్రవీణ్ ల్యాప్‌ట్యాప్‌లో కొందరు వీఐపీల భాగోతాలు కూడా బయటపడుతున్నాయి. చెన్నైకి చెందిన బంగారం వ్యాపారికి హవాలా ఏజెంట్‌గా కూడా చికోటి పనిచేసేవారని తెలుస్తోంది.

వీరికి టాలీవుడ్‌తో బాటు బాలీవుడ్‌కు కూడా చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈడీ దాడి సమయంలో మాధవరెడ్డి కారుపై తెలంగాణా మంత్రికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఐతే అది పాత స్టిక్కరని మంత్రి చెప్పారు. మూడు నెలల క్రితం తీసిపారేశానన్నారు. అలా తీసిపారేసిందాన్ని ఎవరో పెట్టుకుంటే దాంతో సంబంధమేంటని ప్రశ్నించారు మల్లారెడ్డి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నాయకులతో కూడా ప్రవీణ్‌కు పరిచయం ఉందని తెలిసింది. నేపాల్ వెళ్లిన కస్టమర్లలో 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీబి ఛైర్మన్లు వీరి ఖాతాదారుల లిస్ట్‌లో ఉన్నారు. ఇంకా కొందరు సినీతారల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి.