NewsTelangana

బంగాళాఖాతంలో అల్పపీడనం… మరో రెండ్రోజులు వర్షాలు

Share with

గత మూడు వారాలుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను తరచుగా పలకరిస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం వేసవి పూర్తయి, నైరుతి ఋతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి అల్ప పీడనాలతో, అతి భారీ వర్షాలతో ప్రజలను ముంచేస్తూ, వరదలతో నదులు నిండుకుండల్లా ప్రవహిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ తూర్పుతీరంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఆవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తా, ఉత్తర తెలంగాణాకు కూడా భారీ వర్ష ప్రమాదం ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాలకు మళ్లీ వరదముప్పు కూడా పొంచి ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, యానాం ప్రాంతాలకు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లరాదని, 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో 5రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.