Andhra PradeshHome Page Slider

కృష్ణా జలాలపై మరోసారి లేఖ రాద్దాం

Share with

కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్లాలి. కేంద్ర నిర్ణయంపై విధి విధానాలతో గెజిట్ విడుదలైన నేపథ్యంలో మరోసారి ప్రధాని, హోం మంత్రులకు లేఖలు రాయాలి అని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

అమరావతి: కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్లాలి. కేంద్ర నిర్ణయంపై విధి విధానాలతో గెజిట్ విడుదలైన నేపథ్యంలో మరోసారి ప్రధాని, హోం మంత్రులకు లేఖలు రాయాలి అని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కృష్ణా నీటి పంపకాల పునః సమీక్ష బాధ్యతలు అప్పగించడంతో.. ఆ విషయంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో జగన్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఎలా అన్యాయం జరుగుతోందో అధికారులు సీఎంకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా, విభజన చట్టం సెక్షన్ 89కి విరుద్ధంగా ఆ గెజిట్ ఉంది. రాష్ట్ర విభజన ముందు జరిగిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం చెబుతుండగా ఇప్పుడు దానికి విరుద్ధంగా ఈ నిర్ణయం ఉంది. సుప్రీంకోర్టులో పలుపిటిషన్లు పెండింగ్‌లో ఉండగా గెజిట్ ఇవ్వకూడదు. 2002కు ముందు ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, నీటి పంపకాలను తిరిగి పరిశీలించకూడదని చట్టం చెబుతోంది. దానికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు ఉన్నాయి. గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు ఏపీ తరలిస్తున్న నీటి విషయంలో పోలవరం నుంచి తరలిస్తున్న నీటిని లెక్కలోకి తీసుకుని ఆ మేరకు తెలంగాణకు కేటాయింపులు జరపడం సరికాదు. గోదావరి నుంచి 214 టీఎంసీలు తెలంగాణకు తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు.