బీజేపీ జాతీయ అధ్యక్షునిగా కిషన్ రెడ్డి?
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ హై కమాండ్ నేతలు చర్చలు జరుపుతున్న సమయంలో, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గంగపురం కిషన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించడం గమనార్హం. దక్షిణ భారతాన్ని ప్రతినిధిగా నిలబెట్టే నాయకుడిగా, ఆయన అనుభవం, నాయకత్వ లక్షణాలు, ఇందుకు ప్రధాన కారణాలు గా కనిపిస్తున్నాయి.
గంగపురం కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. ఆయన 1964 మే 15న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలానికి చెందిన తిమ్మాపూర్ గ్రామంలో జి.స్వామి రెడ్డి, ఆండాలమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రభావంతో దేశభక్తి భావన కలిగి ఉండి 1980లో బీజేపీ ఆవిర్భావం సమయంలోనే యువమోర్చా కార్యకర్తగా పార్టీలో చేరారు. 1983లో యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా, అనంతరం జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, చివరకు 2002 నుండి 2005 వరకు భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షునిగా సేవలందించారు.

- వ్యక్తిగత జీవితం..
- వ్యక్తిగత జీవితంలో ఆయన టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తి చేసి, 1995లో కావ్యను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. కుమార్తె వైష్ణవి, కుమారుడు తన్మయి రెడ్డి ఉన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకు ₹8 కోట్లకు పైగా ఆస్తులున్నా, ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. తన రాజకీయ జీవితం మొత్తం దేశం, రాష్ట్రం అభివృద్ధి కోసం అంకితభావంతో గడిపిన కిషన్ రెడ్డి, ప్రస్తుతం కేంద్రంలో కీలక మంత్రిగా, తెలంగాణలో బీజేపీ ప్రధాన నేతగా ఉన్నారు.
యువ నాయకుడిగా ప్రస్థానం :
- 1977 – జనతా పార్టీ యువ విభాగం నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభం
- 1982 – BJYM ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాదారు
- 1983– BJYM ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి
- 1986– BJYM ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు
- 1990– BJYM జాతీయ కార్యదర్శి, దక్షిణ భారతానికి ఇన్‌చార్జ్
- 1992 – BJYM జాతీయ ఉపాధ్యక్షుడు
- 1994– BJYM జాతీయ ప్రధాన కార్యదర్శి
- 2002– భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ అధ్యక్షుడు
- 2003– బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అధికార ప్రతినిధిగా కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు…
- రాజకీయ ప్రస్థానం :
కిషన్ రెడ్డి 2004లో తొలిసారి హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభకు ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించారు. తరువాత 2009లో అంబర్‌పేట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి మూడోసారి శాసనసభకు గెలిచి 2016 నుండి 2018 వరకు బీజేపీ శాసనపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి చెందిన ఆయన, 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మోదీ క్యాబినెట్‌లో స్థానం సంపాదించారు. తరువాత 2021లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా ప్రమాణం చేశారు.

తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన సికింద్రాబాద్ నుండి రెండోసారి ఎంపీగా విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై 49,944 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2023 జూలై 4న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయనను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నియమించింది. గతంలో కూడా 2010 మరియు 2014లో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.
- పోరాటాలు :
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కోసం బీజేపీ తరఫున గళమెత్తిన ఆయన, 2012లో మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజుల తెలంగాణ పోరుయాత్రను చేపట్టి, బీజేపీ పాత్రను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేశారు. సాధారణ కుటుంబంలో పుట్టి, బీజేపీలో ఓ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి, క్రమంగా జాతీయ నాయకుడిగా ఎదగడం ఆదర్శప్రాయంగా నిలిచింది.
1: యూనిసెఫ్ నుంచి “బాల మిత్ర పార్లమెంటేరియన్” పురస్కారం
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలనే అభ్యర్థనను విజయవంతంగా మద్దతుగా నిలబెట్టి, యూనిసెఫ్ నుండి “బాల మిత్ర పార్లమెంటేరియన్” బిరుదు పొందారు.
2: పెస్టిసైడ్లపై VAT రద్దు కోసం పోరాటం
రైతుల ప్రయోజనాల కోసం పెస్టిసైడ్లపై అమలు చేయబోయే విలువ ఆధారిత పన్ను (VAT) ను ప్రభుత్వం రద్దు చేయించేందుకు విజయవంతంగా కృషి చేశారు.
జాతీయస్థాయిలో ప్రముఖ విజయాలు
యువతకు సంబంధించిన ప్రధాన విధానాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించారు.
“ప్రపంచ యువజన ఉగ్రవాద వ్యతిరేక సదస్సు” (World Youth Conference Against Terrorism – WYCAT) 2003లో న్యూఢిల్లీ లో నిర్వహించారు.
“సీమ సురక్షా జాగరణ యాత్ర” పేరుతో 7500 కిలోమీటర్లు, 8 రాష్ట్రాల్లో 47 జిల్లాలు, 250 సమావేశాలు నిర్వహిస్తూ సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు.
ఈ యాత్ర అనంతరం సరిహద్దు ఉగ్రవాదం పై పుస్తకాన్ని రచించారు.
1994 నుండి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ‘జాతీయ యువజన కార్యక్రమాల కమిటీ’ సభ్యుడిగా పనిచేశారు.
2000 లో వందేమాతరం నూతన మిల్లేనియం వేడుకల జాతీయ స్థీరింగ్ కమిటీ సభ్యుడు.
అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ విజయాలు
2003 ఫిబ్రవరిలో అంతర్జాతీయ యువజన ఉగ్రవాద వ్యతిరేక సదస్సు నిర్వహించి, 55 దేశాల నుండి 195 ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సదస్సులో UNITED NATIONS ప్రత్యేక ప్రతినిధిని పంపించింది.
అదే సమావేశంలో “World Youth Council Against Terrorism” స్థాపించి, ప్రపంచ యువతను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టారు.
50 పైగా దేశాలలో WYCAT ప్రాంతీయ కమిటీలు ఏర్పడ్డాయి.
బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా, 2003 ఆగస్టు 4–9 మధ్య చైనా అధికార ఆహ్వానంతో సందర్శించారు – గ్రామీణ మరియు పట్టణ ఉపాధి శిక్షణ విధానాలను అధ్యయనం చేశారు.
2003 జులై 26 నుండి ఆగస్టు 1 వరకు ఇజ్రాయెల్‌ను సందర్శించారు – ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల ప్రోత్సాహం పై దృష్టి.
1994లో అమెరికా ప్రభుత్వ సంస్థ ACYPL ఆహ్వానంతో అమెరికా సందర్శించారు – అక్కడి రాజకీయ వ్యవస్థను అధ్యయనం చేశారు.
వరల్డ్ విజన్ – 2000 అనే అంతర్జాతీయ సమావేశంలో వాషింగ్టన్ DC లో పాల్గొన్నారు.
యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, కెనడా, నేపాల్, బల్గేరియా, మలేషియా, ఈజిప్ట్ దేశాలు సందర్శించారు. ఈ విధంగా కిషన్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో చేసిన పోరాటాలకు అనేక బహుమతులు, బిరుదులు, పురస్కారాలు, పొందారు.
ప్రస్తుతం దక్షిణాది నుంచి బీజేపి జాతీయ అధ్యక్షునిగా ఆయన పేరు వినపడటం అందరికీ గర్వకారణం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయనకే ఆ బాధ్యతలు అప్పజెప్పే ప్రయత్నంలో బీజేపి ఉన్నట్లు తెలుస్తుంది… దక్షిణాదిపై పట్టు కోసం బీజేపి ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో బీజేపి మరింత దూసుకుపోయే అవకాశం కనబడుతుంది.