కాంగ్రెస్ గ్యారంటీలను చూసి కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చింది-రేవంత్ రెడ్డి
తెలంగాణాకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ వంచించారని, డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు 25 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందన్నారు. వారికి 250 గజాల స్థలం ఇస్తామన్నారు. రైతులకు ఇందిరా బరోసా పథకం కింద 15 వేల రూపాయల సహాయం చేస్తామని, 1200 రూపాయల వరకూ రైతులకు కరెంట్ ఉచితంగా ఇస్తామన్నారు. 200 యూనిట్ల వరకూ పేదలకు ఫ్రీకరెంట్ ఇస్తామని, పేద ఆడపిల్లలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అవినీతిని నిర్మూలించి, కుటుంబ దోపిడీని నిర్మూలిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన బావ బావమరదులు కాంగ్రెస్ గెలుస్తుందనే భయంతో తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

తెలంగాణాలో పది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధికి, తెలంగాణా ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి పనుల మీదా ఎక్కడైనా చర్చకు సిద్దమేనన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ప్రకటించారని, ఇప్పుడు కూడా ఆమె నోటి ద్వారానే ఆరు గ్యారంటీలను ప్రకటించారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన దోపిడీని అరికట్టాలని పిలుపునిచ్చారు. కొందరు గుంటనక్కలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని వారికి అవకాశం ఇవ్వకూడదని విన్నపం చేశారు. ప్రధాని మోదీ మొన్న జరిగిన నిజామాబాద్ సభలో కేసీఆర్ తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయడానికి తనను సంప్రదించారని చెప్పారని, దీనిని కేసీఆర్ ఇంతవరకూ ఖండించక పోవడంతో అది నిజమేనని రుజువయ్యిందన్నారు. దీనితో బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిసే నాటకాలు ఆడుతున్నారని తెలిసిందన్నారు. రాజకీయ లబ్ది కోసమే విడిపోయినట్లు నటిస్తున్నారని, కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.