Home Page SliderTelangana

ఎమ్మెల్యే అభ్యర్ధి కూనా శ్రీశైలం గౌడ్ తరఫున ప్రచారంలో ఈటల

రంగారెడ్డి: కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కూనా శ్రీశైలం గౌడ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.

గాజుల రామారం డివిజన్ చంద్రగిరినగర్‌లో జరిగిన  ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ: బస్తి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే దమ్ము కేసిఆర్‌కి లేదు కానీ గుడిసెలు వేసుకున్న వారి దగ్గర భూములు లాక్కొని పెద్దవాళ్ళకు కట్టబెడుతున్నారు. ఎల్లమ్మబండలో 250 ఎకరాలలో 160 ఎకరాలు పేదలకు ఆనాటి ప్రభుత్వాలు పంచాయి. మిగిలిన 92 ఎకరాలు దేశ్‌పాండే అనేవాడు రేకులు పాతే ప్రయత్నం చేసిండు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నేను రేకులు పీకేసి ఇది ప్రభుత్వ భూమి నువ్వు ఎవడ్రా రేకులు వేసుకోవడానికి అని పీకేసాను. కానీ కెసిఆర్ ఆ భూమిని వారికి కట్టబెట్టాడు. రూ.4,500 కోట్ల భూమిని బ్రోకర్లకు కట్టబెట్టిన కెసిఆర్‌కి ఓటు వేద్దామా?

బంజారాహిల్స్‌లో నేను రాములు నాయక్ కలిసి ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా కాపాడుకున్నాం. ఆ నాటి ముఖ్యమంత్రి రోశయ్య గారికి చెప్తే  ఇళ్లను కూలగొట్టకుండా ఆపారు. కానీ ఈ ముఖ్యమంత్రి అన్నింటినీ కబ్జాలు చేస్తున్నాడు. కెసిఆర్ ప్రజలను నమ్ముకోలేదు. డబ్బులు నమ్ముకున్నారు. డబుల్ బెడ్ రూం ఇవ్వలేదు అని మీరు కోపంగా ఉన్నారనీ ఈ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెడతాడు. ఓటుకు రూ.10 వేలు ఇస్తారు. ప్రజలారా ఇస్తే తీసుకోండి. ఓటు మాత్రం బిజెపికి వేయండి. మొన్న ప్రధాని పక్కకు పిలుచుకొని మాట్లాడాడు.

నాలుగు హామీలు ఇవ్వమన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పమన్నారు. పుస్తెలు కాళ్ళమీద పెట్టి ఏడ్చే రోజులు పోవాలి. పేద కుటుంబం పెద్ద చనిపోతే కుటుంబం అనాథ కాకుండా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందిస్తాం. పేదవారికి 60 గజాల స్థలం ఇస్తాం లేదంటే డబుల్ బెడ్ రూం అందిస్తాం. రూ.13,500 కోట్లు పెన్షన్లు, కల్యాణలక్ష్మికి ఇచ్చి రూ.45 వేల కోట్లు తాగిపించీ మనదగ్గర లాక్కుంటున్నాడు. ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఆలోచన చేయండి. బీజేపీ వస్తే తెల్లరేషన్ కార్డులు అందిస్తాం. బంగారు తెలంగాణ కాదు బాధల, కన్నీళ్ళ తెలంగాణ మనకు ఇచ్చాడు కేసిఆర్. బీజేపీ వస్తే నిజమైన బంగారు తెలంగాణ తీసుకువస్తాం.