ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ అప్పుడే
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ కాల్పుల విరమణ కోసం ఎదురుచూస్తున్నారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ మారణకాండకు పుల్‌స్టాప్ పెట్టడానికి ఇరుదేశాలు అంగీకరించాయి. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఈ ఒప్పందం అమలులోకి రానుంది. ఈ మేరకు ఖతార్ విదేశాంగ ప్రతినిధి మీడియాకు సమాచారం ఇచ్చారు. తొలి విడతగా ఆరు వారాల్లోగా బందీల మార్పిడి ప్రక్రియ పూర్తి చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇజ్రాయెల్ జైళ్లలో బందీలైన 737 మందిని తొలి విడతగా విడుదల చేస్తున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ విడుదల హమాస్ చెర నుండి తమ దేశ పౌరులు ఎంతమంది విడుదలవుతారన్న దానిపై ఆధారపడి ఉంటుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో 1200 మందిని హతమార్చారు. 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో ప్రస్తుతం 94 మంది గాజాలో ఉన్నారు. వీరిలో తొలి విడతగా 33 మందిని హమాస్ విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఈ యుద్ధంలో మృతి చెందినట్లు అంచనా. అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాలు ఈ కాల్పుల విరమణకు ఎంతో కృషి చేశాయి.