ఆసియా క్రీడల్లో తొలిసారి సెంచరీ పతకాల దిశగా భారత్
భారత్ క్రీడాకారులు ఆసియా క్రీడల్లో దూసుకుపోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా మొట్ట మొదటిసారి సెంచరీ పతకాలు సాధించబోతున్నారు. ఇప్పటికి 90 పతకాలు సాధించారు. ఆర్చరీ, క్రికెట్, బాడ్మింటన్, హాకీ, కబడ్డీలలో భారత్ సత్తా ప్రదర్శించింది. ఈ ఒక్క రోజులోనే నాలుగు పతకాలు వచ్చాయి. రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో దక్షిణకొరియా చేతిలో ఓటమి పాలు కావడంతో రజత పతకంతో సరిపెట్టుకోవలసివచ్చింది. బాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రణయ్ సెమీస్‌లో ఓడిపోవడంతో కాంస్య పతకం సాధించారు. భారత మహిళల జట్టు రికర్వ్ ఆర్చరీలో కాంస్యం సాధించింది. క్రికెట్‌లో కూడా ఫైనల్‌కు చేరడంతో గోల్డ్ రావడం ఖాయమంటున్నారు.

కబడ్డీలో కూడా పాకిస్థాన్‌ను మట్టి కరిపించి ఫైనల్‌కు చేరింది భారత్ జట్టు. ఇలా బ్రిడ్జి, బ్యాడ్మింటన్, హాకీ లలో ఫైనల్స్‌లో తలపడనున్న భారత జట్లు ఏదో ఒక పతకాన్ని సాధించుకు రావడం ఖాయంగా మారింది. ఇలా రాబోతున్న పతకాలు కలిపితే 99 వస్తాయని అంచనాలు వేస్తున్నారు. ఇంకా మన రెజర్లు, చెస్ ప్లేయర్లు కూడా ఉండడంతో మరిన్ని పతకాలతో సెంచరీ దాటి దూసుకుపోతారని భావిస్తున్నారు. ఎప్పుడూ పదుల సంఖ్యలో మాత్రమే పతకాలు వచ్చే భారత్‌కు ఈ ఆసియా క్రీడలలో ఘన విజయాలు నమోదు కావడంతో పండుగ వాతావరణం నెలకొంది.