యాపిల్ ఫోన్లలో ఏఐ ఉపయోగిస్తే మేం ఊరుకోం..ఎలాన్ మస్క్
పేరు పొందిన యాపిల్ ఫోన్లు ఎప్పటి కప్పుడు కొత్త టెక్నాలజీని వాడుకుంటూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటిలో కృత్రిమమేధను ఉపయోగించాలన్న యాపిల్ ఆలోచనను టెస్లా కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ వ్యతిరేకించారు. ఏఐను యాపిల్ ఉత్పత్తులలో ఉపయోగిస్తే తమ కంపెనీలో వాటిని నిషేధిస్తామని పేర్కొన్నారు. యాపిల్ సంస్థ తాజాగా వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. దీనిలో యాపిల్ అప్‌గ్రేడ్‌లను వివరిస్తూ ఐఓఎస్ 18 సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లో ఏఐను జోడిస్తున్నామని యాపిల్ పరికరాలలో చాట్‌జీపీటీని అనుసంధానించడానికి ఓపెన్ ఏఐతో ఒప్పందం చేసుకుంటామని వెల్లడి చేసింది. దీనితో ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐ వాడితే యాపిల్ సంస్థ పరికరాలను తమ కంపెనీలో నిషేధిస్తామని తెలియజేశారు. దీనివల్ల వినియోగదారుల డేటా గోప్యతకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. యాపిల్ తమ సొంత ఏఐని తయారు చేసుకుంటే మంచిదని సూచించారు. దీనిపై కొందరు నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందించారు. ఓపెన్ ఏఐను అనుసంధానిస్తే యాపిల్ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటుందని కామెంట్లు చేస్తున్నారు.