‘చైనా వల్ల ఏం ముప్పుందో అర్థం కావట్లేదు’..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
ఏదో ఒక అంశంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ ఓవర్ సీస్ నేత శామ్ పిట్రోడా మరోసారి చైనా గురించి వ్యాఖ్యానించి పార్టీని ఇరుకున పెట్టారు. పొరుగు దేశం చైనా, భారత్‌కు శత్రు దేశం కాదని, అసలు చైనా నుండి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉందో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. తన వైఖరి మార్చుకుని చైనాతో ఘర్షణకు చెక్ పెట్టాలన్నారు. ఘర్షణాత్మక వైఖరి వల్ల శత్రుత్వం పెరుగుతుందని, భారత్ తన విధానాన్ని మార్చుకోవాలని లేదంటే చైనా నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా కూడా చైనాను శత్రుదేశంగా చూడడం వల్ల భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోందని విమర్శించారు. దీనితో బీజేపీ నేతలు పిట్రోడాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అసలే భారత్, చైనాల మధ్య సరిహద్దు గొడవలు ఉండడంతో భారత్‌దే తప్పంటూ పిట్రోడా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.