నేను మీ అక్కను, ముఖ్యమంత్రిగా రాలేదు, నాతో మాట్లాడండి
ఆందోళన చేస్తున్న వైద్యులతో బెంగాల్ సీఎం మమత బెనర్జీ మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా రాలేదని, దీదీగా మాత్రమే వచ్చానన్నారు. వైద్యులతో ప్రతిష్టంభన నేపథ్యంలో ఇవాళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకేశారు. శనివారం వైద్యులు ఆందోళన చేస్తున్న ప్రదేశాన్ని సందర్శించి వారిని ఉద్దేశించి మాట్లాడారు. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినప్పటి నుండి వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యుల మధ్య చర్చ కోసం రెండు వర్గాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అయితే చర్చను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ వైద్యులు డిమాండ్ చేయడంతో అవి నిలిచిపోయాయి.

మమత బెనర్జీ సోమవారం నిరసన స్థలానికి చేరుకుని, వైద్యులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్యుల నినాదాల మధ్య ఆమె బెంగాలీలో, “దయచేసి ఐదు నిమిషాలు నా మాట వినండి, ఆపై నినాదాలు చేయండి, అలా చేయడం మీ ప్రజాస్వామ్య హక్కు. నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నా భద్రతా అధికారుల సలహాకు వ్యతిరేకంగా, నేను మీ నిరసనలకు సెల్యూట్ చేయడానికి వచ్చాను, నా పోస్ట్ పెద్ద విషయం కాదని నాకు తెలుసు. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. మీరు అలా ఉండటం చూసిన నేను బాధపడ్డాను .” అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వైద్యులు నెల రోజులుగా నిరసనలు కొనసాగిస్తోండటంతో నేరుగా వారితో చర్చించేందుకు సీఎం స్థానంలో ఉండి మమత బెనర్జీ వచ్చారు. వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిష్కరిస్తుందన్నారు.

“నేను డిమాండ్లను అధ్యయనం చేస్తాను, నేను ఒంటరిగా ప్రభుత్వాన్ని నడపను. నేను ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌తో మాట్లాడతాను. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాను. నేను తిలోత్తమ విషయంలో (అత్యాచారం, హత్యకు గురైన మహిళకు ఇచ్చిన పేరు) మీ డిమాండ్లను పరిశీలిస్తాను’’ అని ఆమె వైద్యులకు హామీ ఇచ్చారు. వైద్యులు తక్షణం ఆందోళన ఆపాలని, వైద్యం అందక ఎందరో మరణిస్తున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు. “పనిలో చేరండి. ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాను. ప్రతి ఆసుపత్రిలో సీనియర్, జూనియర్ డాక్టర్లు సభ్యులుగా ఉండే కమిటీలను ఏర్పాటు చేస్తాను. దోషులుగా తేలిన ప్రతి ఒక్కరూ శిక్షిస్తా. దోషులు నా స్నేహితులు కారు, వారి రాజీనామా కోసం డిమాండ్ చేయండి. నేను ఎటువంటి చర్య తీసుకోను.” అంటూ మమత చెప్పుకొచ్చారు.

“మీరు నాపై నమ్మకం ఉంచితే, మీ ఫిర్యాదులను నేను పరిశీలిస్తాను. కేసు సుప్రీంకోర్టులో ఉంది (డాక్టర్లు తిరిగి విధుల్లోకి రావడానికి సెప్టెంబర్ 10 గడువు విధించింది) తదుపరి విచారణ మంగళవారం. నేను మీ ‘దీదీ’గా అభ్యర్ధన చేయడానికి వచ్చాను. నేను మీ నిరసనకు మద్దతు ఇస్తున్నాను. 26 రోజుల ఆమరణదీక్ష వేళ (సింగూర్‌లో సాగుభూమి సేకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసన సమయంలో), అప్పటి ప్రభుత్వం నుండి ఎవరూ నాతో మాట్లాడటానికి రాలేదు, ”అంటూ మమత బెనర్జీ చెప్పారు.