NewsTelangana

హైదరాబాద్ ‌ నకిలీ డాక్టర్.. రోగుల జీవితాలతో చెలగాటం

Share with

ఇన్నాళ్ళు నగరంలోని పలు రకాల ప్రైవేటు ఆసుపత్రులను ,ఎంతోమంది రోగులను తాను వైద్యుడనని అని నమ్మించిన కాంపౌండర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నిరోజులు ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకుండా డాక్టర్‌గా చలామణి అయిన విజయకుమార్ అనే యువకుడిని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.అయితే డిగ్రీ చదివిన  విజయకుమార్ నకిలీ ధ్రువపత్రాలతో ఓ ఆసుపత్రిలో ఎంబీబీస్ డాక్టర్‌గా ..మరో ఆసుపత్రిలో ఎండీగా వ్యవహరించాడు. నకిలీ డాక్టర్‌కు సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ రాచకొండ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో ఎస్‌వోటి డీసీపీ, ఏసీపీలు డి.వెంకన్ననాయక్, కె.పురుషోత్తం రెడ్డిలతో కలిసి సీపీ మహేష్ భగవత్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఆ వివరాల ప్రకారం సూర్యాపేట్ జిల్లా హుజుర్‌నగర్‌కు చెందిన కుడిలెట్టి విజయకుమార్ దూర విద్యలో బీఎస్సీ చదివాడు. తరువాత తన సొంతూరిలో ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్‌గా చేరాడు. కొన్నాళ్ళకు హైదరాబాద్ వచ్చిన విజయ్‌కుమార్  నగరంలోని పలు ఆసుపత్రులలో కాంపౌండర్/పీఆర్‌వోగా పనిచేశాడు. ఆ సమయంలో వైద్యులు రాసే చీటీలోని మందులను బాగా అర్థం చేసుకున్నాడు. సమాజంలో డాక్టర్లకు ఉండే గౌరవ మర్యాదలు,వాళ్ళ ఆదాయం చూసి తాను కూడా డాక్టర్ అయితే బాగుంటుంది అనుకున్నాడు. రెండేళ్ళ క్రితం దిల్‌సుఖ్ నగర్ సిగ్మా ఆసుపత్రిలో పీఆర్‌వోగా పనిచేస్తున్నప్పుడు సిటీస్కాన్ మరమ్మత్తు చేసేందుకు వచ్చిన మల్లేపల్లికి చెందిన అఫ్రోజ్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడింది.తనకు డాక్టర్ ‌గా పనిచేసేందుకు నకిలీ ఎంబీబీఎస్ విద్యార్హత పత్రాలు కావాలని అతనిని కోరాడు.దీంతో అఫ్రోజ్ ఖాన్‌ తనకు తెలిసిన మహబూబ్ అలి జునైద్ అనే కంప్యూటర్ సర్వీసెస్ నిర్వహించే వ్యక్తిని సంప్రదించాడు.

ఆ వ్యక్తి ఇంటర్నెట్ నుండి విదేశీ విశ్వవిద్యాలయాల విద్యార్హత పత్రాలను డౌన్‌లోడ్ చేసి యాప్ సాయంతో నకిలీ పత్రాలు రూపొందిస్తుంటాడు. అయితే విజయ్‌కుమార్‌కు ఈ నకిలీ పత్రాలను  రూ.8 లక్షలకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటివరకు విజయ్‌కుమార్  రూ.6.50 లక్షలు అలి జునైద్‌కు చెల్లించాడు. దీనిలో మధ్యవర్తిగా ఉన్న అఫ్రోజ్‌ఖాన్ రూ.2 లక్షలు తీసుకున్నాడు. ఈ విధంగా విజయకుమార్ కాజన్ స్టేట్ మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు నకిలీ పత్రాలను సంపాదించాడు. దుబాయ్‌లో ఉన్న మహ్మద్ ఇర్ఫాన్ సాయంతో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను సేకరించాడు. రష్యా వెళ్లి చదువుకొని వచ్చానని నమ్మించేందుకు విజయ్‌కుమార్ తన పాస్ ‌పోర్ట్‌పై నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంపు వేశాక  మిగిలిన రూ.లక్షన్నర ఇచ్చేలా మాట్లాడుకున్నారు. అయితే కరోనా కారణంగా వైద్యులకు పెరిగిన డిమాండ్‌ను విజయ్‌కుమార్ ఈ విధంగా ఉపయోగించుకున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు.అదే విధంగా విజయ్‌కుమార్ సహా మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి నకిలీ పత్రాలు, 3 సెల్‌ఫోన్లు,కొత్త  కారు,ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.