జమ్ముకాశ్మీర్‌లో భారీ ఓటింగ్..పాక్ అక్కసు..
జమ్ముకాశ్మీర్‌లో తొలిదశలో భారీ ఓటింగ్ నమోదయ్యింది. అయితే ఈ ఓటింగ్ శాతంపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది పాకిస్థాన్. దీనిపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మీడియాతో మాట్లాడింది. భారత్ జమ్ముకాశ్మీర్‌ను ఆక్రమించిందని, అందుకే కాశ్మీర్‌లో జరిగే ఎన్నికలకు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి విలువ లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలపై భారత్‌కు గుర్తుచేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత జరిగే ఈ ఎన్నికలు హాస్యాస్పదం అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాన్ని గుర్తు చేశారు. జమ్ము కాశ్మీర్ వివాదానికి తుది పరిష్కారం కాశ్మీర్ ప్రజల కోరిక మేరకు జరుగుతుందని ఐక్యరాజ్యసమితి తీర్మానంలో రాయబడిందని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఆక్రమణలకు గురవుతున్నారని, రాజకీయ ఖైదీల సంఖ్య వేలల్లో ఉందని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌లో భయం, బెదిరింపు వాతావరణం నెలకొందని అందుకే ఈ ఎన్నికలు చెల్లుబాటు కావన్నారు.
కాగా తొలిదశలో ఎన్నికలలో 61.11 శాతం ఓటింగు నమోదయ్యింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండవదశ సెప్టెంబరు 25, మూడవదశ అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబరు 8న ఫలితాలు రానున్నాయి.