అధిక ఉష్ణోగ్రతల (వేడి) మంట
ఒంగోలు: వర్షాకాలం వచ్చినా వాతావరణం ఇంకా ఎండాకాలాన్నే తలపిస్తోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రెండు వారాలుగా 39 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళ వేడి గాలి తీవ్రత కొనసాగుతోంది. ఉపశమనం పొందేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా ఏసీలు, ఎయిర్ కూలర్లు, పంకాలను ప్రజలు వినియోగిస్తున్నారు. ఫలితంగా కరెంట్ వినియోగం క్రమేణా పెరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అక్టోబర్ నెలలో రోజుకు సరాసరిన 10.8 మి. యూనిట్లు కేటాయించగా.. గత వారం రోజులుగా 12.5 మి. యూనిట్ల మేర వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 9 నుండి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరికొన్ని చోట్ల 9.30 నుంచి 12 గంటల వరకు కోత విధించారు. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో అత్యవసరం కింద సరఫరా నిలిపి వేస్తున్నారు. దీంతో గ్రామాలు అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. కోతల నుంచి మండల కేంద్రాలతోపాటు, మున్సిపాలిటీలను మాత్రం మినహాయించారు. కరెంట్ కోతలు లేవంటూ ప్రకటిస్తున్నప్పటికీ…: ఓ వైపు కరెంట్ కోత లేదంటూ అధికారులు ప్రకటిస్తున్నా గృహ, వ్యవసాయ రంగాల అవసరాలకు జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో అప్రకటిత కోతలు అమలవుతూనే ఉన్నాయి. తాజాగా పెరిగిన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని కరెంట్ సంస్థలు మళ్లీ కోతలు అమలు చేస్తున్నాయి. అత్యవసర లోడ్ ఉపశమనం (ఈఎల్ఆర్) పేరుతో రాత్రివేళ కరెంట్ సరఫరాలో కోత విధిస్తుండటంతో పల్లెవాసులు పడుతున్న అవస్థలు అంత ఇంతా కావు. బయటకొస్తే దోమలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోత కారణంగా రాత్రివేళ జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలున్నవారు దోమల నుంచి కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.