Andhra PradeshHome Page Slider

అన్నదాతకు గుండె కోత

Share with

త్రిపురాంతకం గ్రామీణం: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయి. బోర్ల ద్వారా పంటలు కాపాడుకోవాలని అన్నదాతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా.. తరచూ కరెంట్ కోతలు వారి పాలిట శాపంగా పరిణమించాయి. త్రిపురాంతకం మండలంలో 13,500 ఎకరాల్లో పలురకాల పంటలు సాగయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి వెచ్చించి బోరు బావుల కింద పంటలు సాగు చేశారు. అటు సాగర్ నీరివ్వకపోవడంతో పాటు విద్యుత్ కోతలు అమలు చేస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయి.

పెట్టుబడులు మట్టిపాలేనా..!: త్రిపురాంతకం మండలంలోని త్రిపురాంతకం, గణపవరం, మేడపి, విశ్వనాథపురం, సోమేపల్లి, లేళ్లపల్లి, దూపాడు, కేశినేనిపల్లి గ్రామాల్లో మొత్తం 8 కరెంట్ ఉప కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 29 ఫీడర్లున్నాయి. రైతులకు 9 గంటల పాటు నిరంతరాయంగా పగటిపూట కరెంట్ సరఫరా చేయాలని ప్రభుత్వం చెప్పడంతో కొన్ని ఫీడర్లకు ఉ.6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, ఉ.9 నుంచి సా.6 గంటల వరకు మిగతా ఫీడర్లకు కరెంట్ సరఫరా చేసేవారు. ఇటీవల సరైన సమయానికి సరఫరా కావడం లేదు. దీంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు 4, 5 గంటల కరెంట్ కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వరి పొలాలు నిలువునా ఎండిపోతున్నాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే పెట్టుబడులు మట్టి పాలవుతాయని.. గింజ ధాన్యం కూడా చేతికందవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.