తెలంగాణ డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్..
2024 డీఎస్సీలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ 2024 DSC ఉపాధ్యాయులకు 2024 అక్టోబర్ 10 నుంచి వారి సర్వీసు లెక్కించి వేతనం చెల్లించాలన్న వారి డిమాండ్ కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ట్రెజరీ అధికారులకు ఆ తేదీ నుంచి వేతన బిల్లులను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం DSC ద్వారా ఎంపికైన 11,062 మంది ఉపాధ్యాయులకు (సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్) వర్తించనుంది. ఇది వారి సర్వీసు గుర్తింపులో స్పష్టతను తీసుకురానుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.