ఇకపై ఔటర్ రింగ్ రోడ్డు పైకి రయ్.. రయ్..
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు పైకి రాకపోకలు సాగించేందుకు అనువుగా కొత్తగా మరో ర్యాంపు గురువారం నుండి అందుబాటులోకి వచ్చింది. హెచ్ ఎం డీ ఏ ఆధ్వర్యంలో దాదాపురూ.45 కోట్లతో మల్లంపేట్-బోరంపేట్ రహదారి మధ్యలో మల్లంపేట్ ర్యాంపుల నుండి వాహనాలకు అనుమతి లభించింది. మల్లంపేట్, శంభీపూర్ వైపు షార్ట్ కట్‌లో వెళ్లేందుకు ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్లపై రెండేసి ర్యాంపుల నిర్మాణానికి గతంలో హెచ్ ఎం డీ ఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవలే ఈ పనులు పూర్తి చేశారు. తొలుత మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దీనిని ఓపెనింగ్ చేయిద్దామని భావించారు. ఇంతలోనే ఎన్నికల నియమావళి రావడంతో ఎలాంటి హడావుడి లేకుండా అధికారులు ఈ ర్యాంపులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. మల్లంపేట్ ర్యాంపులు అందుబాటులోకి రావడంతో వేలాది మంది ఈ ప్రాంత ప్రయాణికులకు వెసులుబాటు కలుగుతుంది.