Home Page SliderTelangana

మంథనిలో మహిళా రేషన్ డీలర్ దారుణహత్య

Share with

తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మహిళా రేషన్ డీలర్‌ రాజమణి(37) దారుణంగా హత్యకు గురయ్యింది. రాజమణి భర్త రమేష్ నాలుగేండ్ల కిందటే మరణించారు. ఆమె అప్పటి నుండి రేషన్ డీలర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పైడాకుల సంతోష్ అనే ఆటోడ్రైవర్‌తో ఆమెకు కొంతకాలం కిందట పరిచయమయ్యిందని, అతడు ఆమెను వేధిస్తుండడంతో కొద్ది రోజులుగా వారిద్దరూ మాట్లాడుకోవడం లేదని ఆమె సోదరుడు పోలీసులకు తెలియజేశారు. మంథనికి వెళ్తున్నానని సోమవారం సాయంత్రం పిల్లలకు చెప్పి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆమె సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు సంతోష్ ఇంట్లో రాజమణి మృతదేహాన్ని గుర్తించారు. తనను తిరస్కరించినందుకే సంతోష్ రాజమణిని హత్యచేసి ఉంటాడని సోదరుడు ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.