Home Page SliderTelangana

గ్రామ గ్రామనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు- మంత్రి గంగుల కమలాకర్‌

  రైతులు తాము పండించిన ధాన్యం రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని బీసీ సంక్షేమం పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి మోసపోకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతీ ధాన్యపు గింజనూ కొంటామని పేర్కొన్నారు.

ఆదివారం కరీంనగర్‌ రూరల్‌ మండలం చర్లబూత్కూరు, ముగ్దంపూర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏడాదిలో వానాకాలం యాసంగి 2 సీజన్లలో కనీస మద్ధతు ధరకు రాష్ట్రంలో రైతులు పండిరచిన ధాన్నాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.  ధాన్యంలో తేమ 17 శాతం మించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో వర్షాకాలం, యాసంగి రెండు పంటలు పండిస్తారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా యాసంగి పంటను కొనుగోలు చేస్తున్న ఘనత కేవలం ముఖ్యమంత్రి కెసీఆర్‌దేనన్నారు.  సమైక్య పాలనలో సాగునీరు లేక సగం భూమిపెట్టిన రోజులు ఉండేవని కానీ సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకుతున్నాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో తెలంగాణలో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయని అన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సకాలంలో నీళ్లు, యూరియా బస్తాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను సకాలంలో వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్‌ వి కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ జీవి శ్యాం ప్రసాద్‌ లాల్‌, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, జెడ్‌ పి టి సి పురమల్ల లలిత, పిఎసిఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌ రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెడ్‌ వేణి మధు, సర్పంచ్‌ దుబ్బేట రమణారెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్‌, శ్రీకాంత్‌ రెడ్డి, తహసీల్దార్‌ డాక్టర్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.