తెలంగాణ ప్రజలకు ఈటల పిలుపు
తెలంగాణ ప్రజలారా ఆలోచించండి… ఒక్కసారి ఆలోచించండి… వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భాగ్య రేఖను మార్చే ఎన్నికలు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలు మరో రెండు నెలలు రాబోతున్నాయి. నవంబర్ 30వ తారీకు తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల సమరం జరగబోతోంది. ఈ ఎన్నికల్లో ప్రజలకు నిఖార్సైన పాలన అందించే పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న ఘోరాలు-నేరాలు మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం పని చేయకుండా ఏం చేస్తుందన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. పేద ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఆసరాగా చేసుకుని పథకాలంటూ ఊరిస్తూ వస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన పని చెప్పినట్లుగా చేసే ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా రానిపక్షంలో తెలంగాణ ప్రజలు మరో ఐదేళ్లపాటు బందీలుగా మిగులుతారు ఇప్పటికే తెలంగాణలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ కునారిళ్లిపోయాయి. అధికారపార్టీ ఇష్టానుసారం రాజకీయాలు చేస్తోంది. తెలంగాణలో హక్కుల హననం జరుగుతోంది. ప్రభుత్వం తెలంగాణ బాధ్యతలు నెరవర్చడం మానేసింది. సమస్యలు పేరుకు పోతున్నాయి. తెలంగాణలో రైతులు అంతకంతకు పేదోళ్లు అవుతున్నారు. కేసీఆర్ విధానాలు, నిర్ణయాలు, ప్రకృతి విపత్తులు శాపాలుగా మారి, రైతుబంధు పథకం ఆసరాగా నిలవడం లేదు.

తెలంగాణలో పాలన కేవలం ఒక కుటుంబం చేతిలో చిక్కుకుపోయింది. ఆ కుటుంబంలోని వారికి పదవులు అధికారాలు పంచేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం రాకుంటే వచ్చే రోజుల్లో తెలంగాణ ప్రజానీకం మనుగడ సాగించడం దుర్భరమవుతుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే ఓవైపు మిగులు రాష్ట్రంగా చెప్పుకున్న తెలంగాణ… అప్పులకుప్పగా మారిపోయింది. ప్రాజెక్టుల పేరుతో జనాలను లూటీ చేసిన వైనం కళ్ల ముందే చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు కథలు అన్నీ ఇన్నీ కావు. లక్ష కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేశారో నిగ్గు తేలాల్సి ఉంది. తెలంగాణలో ఈ సమస్య ఆ సమస్య అన్నది కాకుండా రోజురోజుకు కొత్త సమస్యలను, సంక్షోభాలను పాలకులు పెంచుకుంటూ పోతున్నారు. పథకాలన్నీ కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పంచే విధంగా ప్రభుత్వ పెద్దలు తీర్చిదిద్దారు. ఏ పథకము చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలున్నాయి. కేవలం ఓట్లు నోట్లు సీట్లు అన్న మూడు పదాల చుట్టూ కేసీఆర్ పథకాలు పరిభ్రమిస్తున్నాయి తప్పించి పేదలకు నిరుపేదలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. వచ్చే రోజుల్లో తెలంగాణలో మరో సారి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఇక సామాన్యుడు అధోగతే.

అందుకే కళ్ళు తెరవండి కేసీఆర్ తెలంగాణను ఏ విధంగా దెబ్బతీస్తున్నారన్నది గ్రహించండి. పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలా జరిగిందో మనందరం చూశాం. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నియామకం విషయంలో ఏ విధంగా వ్యవహరించిందో కళ్లారా చూశాం కేవలం ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే గత ఆరు నెలలుగా నోటిఫికేషన్లు ఇస్తూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారు. కేవలం నోటిఫికేషన్ ద్వారానే ఉద్యోగాలు ఇచ్చామన్న భావన తెలంగాణ యువతలో కలిగించి ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు. నిరుద్యోగ భృతి అంటూ గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకం కనుచూపుమేరలో కనిపించడం లేదు ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా కొత్త హామీలంటూ కథలు చెబుతున్నారు. కేసీఆర్ ఓవైపు నిరుద్యోగుల గొంతు మాత్రమే కోయలేదు. ప్రభుత్వోద్యోగులను ఎంతో క్షోభపెట్టారో చూశాం. టీచర్ల బదిలీ వ్యవహారంలో అనుసరించిన లోపభుయిష్టత మనందరికీ తెలిసిందే. నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఊదరగొట్టి ఇప్పుడు మరోసారి మభ్యపెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది కల్వకుంట్ల వారి ఇంట వంటా లేదన్న భావన గడిచిన 9 నెలల రుజువవుతోంది.
ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఎమ్మెల్యే
బీజేపీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్