జగన్ 50-75 ఏళ్ళ క్రితమే ఏపీలో ఉంటే.. మంత్రి ధర్మాన ప్రసాదరావు
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి 50-75 ఏళ్ల క్రితమే ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో పేదలు ఉండేవారు కాదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం అధికారాన్ని బంధువులకు ,శ్రేయోభిలాషులకు పంచి పెట్టేది కాదన్నారు. అలాంటి వాటికి ఈ ప్రభుత్వంలో చోటు లేదని తెలిపారు.ఏడాదిలోనే ఈ ప్రభుత్వం పని అయిపోతుందని చాలామంది అన్నారని… ఇప్పటికే మూడేళ్ళు పూర్తి చేసుకున్నామన్నారు. రెండోసారి,మూడోసారి కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పేదలకు సదుపాయాలు కల్పంచి వారిలో ఆత్మ విశ్వాసాన్నినింపి… ఆంధ్రప్రదేశ్ లో పేదరికాన్ని నిర్మూలిస్తామని తెలిపారు. సంపన్నులు కాస్త ఓపిక పట్టాలని దీనిపై పార్టీ కార్యకర్తలు వారికి నచ్చజెప్పాలని కోరారు.
గుంటూరు జిల్లా,మంగళగిరి మండలం ,పెద్ద కాకాని నేషనల్ హైవే -16 వద్ద శుక్రవారం నుండి వైసిపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్ విజయమ్మ,వైసీపీ మంత్రులు,కార్యకర్తలు మరియు అభిమానులు హజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో ఎన్నో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జగన్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.అదే విధంగా తాను వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సమావేశాలలో పలువురు మంత్రులు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన పలు సంక్షేమ పథకాల గురించి ప్రసంగించారు.