తాడేపల్లి కార్యాలయంలో లోకేష్‌ను విచారిస్తున్న సీఐడీ
ఏపీ సీఐడీ తెలుగుదేశం నేతలపై పట్టు బిగించింది. ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ, తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్‌ను విచారిస్తోంది. తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో లోకేష్‌ను విచారణకు పిలిపించింది. ఈ కేసులో లోకేష్‌ను ఏ 14గా నమోదు చేశారు పోలీసులు. లోకేష్ గతంలోనే ఢిల్లీలో ఉండగా, ఢిల్లీకి వెళ్లి నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. అనంతరం లోకేష్ ముందస్తు బెయిల్‌కు పిటిషన్ వేయగా, అరెస్టు భయం లేనందున ముందస్తు బెయిల్ అవసరం లేదని, విచారణకు సహకరించమని హైకోర్టు ఆదేశించింది. దీనితో నేడు విచారణకు హాజరయ్యారు లోకేష్. సాయంత్రం 5 గంటల వరకూ లోకేష్‌ను విచారించనున్నారు. గతంలోనే హెరిటేజ్ భూముల క్రయవిక్రయాలపై వివరాలు వెల్లడించమని లోకేష్‌ను ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హెరిటేజ్, లింగమనేని భూముల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను మార్చారంటూ సీఆర్డీఏపై లోకేష్ ఒత్తిడి తెచ్చారనే అభియోగాలు మోపింది సీఐడీ. ఈ క్రమంలోనే లోకేష్‌ను విచారిస్తున్నారు.