ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు షాక్
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురు దెబ్బ తగిలింది. కాగా చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు నిరాకరించింది. చంద్రబాబు స్కిల్ కేసులో బెయిల్ ఇవ్వాలంటు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ను దాఖలు చేశారు.అయితే ఈ పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరో వైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.కాగా 17A అమల్లోకి రాకముందే నేరం జరిగి విచారణ కూడా ప్రారంభమైందని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. నేరం జరిగిన సమయంలో ఉన్న చట్టం అమలవుతుంది అని ఆయన వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కేసులు తొలగించినా..మిగతా చట్టాల్లోని సెక్షన్లు అన్ని కొనసాగుతాయని ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు.అయితే ఈ కేసులో 36మంది ఇతర నిందితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో A-37గా చంద్రబాబు ఉన్నారని ముకుల్ రోహత్గీ తెలిపారు. ఈ కేసులో చాలామంది పబ్లిక్ సర్వెంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. అయితే 17-A వచ్చాక ఓ వ్యక్తిని నిందితుడిగా చేసినప్పుడు 17-Aసెక్షన్ వర్తింపజేయరా అని ధర్మాసనం ప్రశ్నించింది. నేరం జరిగిన సమయంలోని చట్టాలు అమలు చేయాలి. కొత్త సెక్షన్, లేదా కొత్త చట్టం తెచ్చినప్పుడు అది తెచ్చిన తర్వాతే అమలు అవుతోందని… అంతకు ముందు జరిగిన నేరాలకు చట్టసవరణ వర్తింపజేయలేమని ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు.