Breaking Newshome page sliderHome Page SliderTelangana

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని, పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నందున ఈ ఎన్నికల్లో తాను లేదా కేసీఆర్ ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని గుర్తు చేసిన ఆయన, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగిస్తామని తెలిపారు. శివరాత్రి లోపు ఎన్నికల ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని, అభ్యర్థుల ఎంపికలో సర్వే నివేదికలు స్థానిక బలబలాలకే ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారం చేసినా సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాత నేరుగా అసెంబ్లీ ఎన్నికలే జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో లేదని, స్థానిక సంస్థల వ్యవస్థను బలహీనపరుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోందని, ప్రజలు కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని పలు జిల్లాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. జనగాం, సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తి వంటి జిల్లాలను ఎత్తివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాల కనుమరుగు ఖాయమని హెచ్చరించారు. జిల్లాలు ఉండాలా వద్దా అనేది ప్రజలే తమ ఓటు ద్వారా నిర్ణయించాలని పిలుపునిచ్చారు. బస్తీబాట కార్యక్రమం ద్వారా తాము ప్రజల్లోకి వెళ్లి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన తీరును వివరిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వంపై వచ్చిన పలు ఆరోపణల విషయంలో కూడా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఫార్ములా ఈ రేసింగ్ ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల్లో తమపై చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం ఇప్పటివరకు ఆధారాలు చూపలేకపోయిందని విమర్శించారు. ఒకవైపు ఫార్ములా ఈ కేసులో దోషులుగా పేర్కొంటున్న సంస్థలతోనే ముఖ్యమంత్రి దావోస్‌లో చర్చలు జరపడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. బొగ్గు కుంభకోణంపై విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల జంట నగరాల అస్తిత్వం దెబ్బతింటోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.