భద్రాచలాన్ని భయపెడుతున్న గోదారమ్మ..కరుణించేది ఎప్పుడమ్మా..?
భారీ వర్షాలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 32 ఏళ్ళ తరువాత గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరింది. అయితే గోదావరికి భారీగా పోటెత్తిన ఈ వరద ప్రవాహం ప్రళయాన్ని తలపిస్తుంది.శుక్రవారం అర్దరాత్రి 2 గంటల నాటికి గోదావరి నీటిమట్టం దాదాపు 71.30 అడుగుల వరకు నమోదయ్యింది. భద్రాచలం వద్ద గోదావరిలో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో 24.13 లక్షల క్యూసెక్కుల మేర నీరు ప్రవహిస్తుంది. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టంతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వరద ఉధృతికి 95 గ్రామాలు నీట మునిగాయి. దీనితో 77 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను అక్కడికి తరలించారు. అయితే అర్దరాత్రికి వరద ప్రవాహం నిలకడగా ఉంటుందని అధికారులు భావించినప్పటికీ లోతట్టు ప్రాంతాలలో ముంపు తీవ్రత మరింత ఎక్కువయ్యింది. దీంతో అక్కడి పంట పొలాలు బాగా దెబ్బ తిన్నాయి. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బ తిని విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.దుమ్ముగూడెం ,చర్ల మండలాలలో ఈ సమస్య అధికంగా ఉంది. దాదాపు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో ఉన్న సమాచార సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.ఈ నేపథ్యంలోప్రజా, రవాణా ,సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇక ముంపు ప్రాంతాలలో అయితే పరిస్థితి మరీ దయనీయంగా తయారయ్యింది.