అపమృత్యుదోషాన్ని తొలగించే భగిని హస్త భోజనం
రాఖీ పండుగ లాంటి అన్నాచెల్లెళ్ల పండుగ
. ఉత్తరాది రాష్ట్రాల వారికి భాయ్ దూజ్
. సోదరి చేతి భోజనం తినే ఆచారం
. సోదరుడికి దీర్ఘాయువునిచ్చే భగిని భోజనం
మనదేశంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలలో భగిని హస్త భోజనం ఒకటి. ఇది అపమృత్యు దోషాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. భగిని అంటే సోదరి. హిందూ సంస్కృతిలో ఎంతో పవిత్రమైన, సోదరభావాన్ని ప్రతిబింబించే ఆచారం. ఇది ప్రధానంగా కార్తీక మాసం లో పాటించే ఒక పుణ్యకార్యం. భారతీయ కుటుంబ వ్యవస్థలో సోదరుడు, సోదరీమణుల మధ్య అనుబంధం ఎంతో ప్రముఖమైనది. కుటుంబ వ్యవస్థ బలంగా మారడానికి దోహదం చేస్తుంది.
దీని గురించి ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. భగిని హస్త భోజనం ఆచారానికి, అలాగే యమ ద్వితీయ (భాయ్ దూజ్) పండుగకు మూలం. ఇది స్కాంద పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం లలో ప్రస్తావించబడింది. సూర్యభగవానుడు మరియు సంజ్ఞాదేవి ఇద్దరికీ యముడు మరియు యమునా దేవి అనే జంట సంతానం కలిగారు. ఇద్దరూ చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమతో పెరిగారు. కానీ తరువాత యముడు యమలోకానికి వెళ్లి తన కర్తవ్యాన్ని చేపట్టాడు. యమున మాత్రం భూమిపై పవిత్ర నదిగా అవతరించింది. ఒకరోజు యమునా దేవి తన అన్న యముడిని ఆహ్వానిస్తూ ఇలా కోరింది. “అన్నయ్యా! నీవు యమలోకంలో పాపాత్ముల పాపాలను తీర్చడంలో నిమగ్నుడివి, కానీ ఒక్కసారైనా నా ఇల్లు రావు. నా చేత్తో భోజనం చేసి, నాకు సంతృప్తిని ఇవ్వు.”
దీనికి యముడు మొదట అంగీకరించలేదు. “సోదరీ నేను మరణదేవుడిని. నా రాకతో ప్రజలు భయపడతారు.” అని చెప్పాడు. కానీ యమునా ప్రేమతో మళ్లీ మళ్లీ ఆహ్వానించింది. చివరికి యముడు కార్తీక శుక్ల ద్వితీయ రోజున తన చెల్లెలు ఇంటికి వచ్చాడు. యమునా అతనికి స్నానం చేయించి, పూలతో అలంకరించి, దీపం వెలిగించి పూజ చేసి భోజనం పెట్టింది. ఆ ప్రేమతో యముడు ఆనందపడి ఆమెను ఆశీర్వదించాడు. అంతేకాకుండా “ఎవరైతే ఈ రోజున తమ చెల్లెలు ఇంటికి వెళ్లి ఆమె చేత్తో భోజనం చేస్తారో, వారిని నేను యమలోకంలోకి పిలవను. వారికి దీర్ఘాయుష్షు లభిస్తుంది.” అని ప్రజలందరికీ వరం ఇచ్చాడు.
రాఖీ పండుగ లాగే ప్రత్యేకమైన పండుగ భగిని హస్త భోజనం. “భగినీ హస్త సముద్దిష్టం భోజనం పాపనాశనం” అంటే చెల్లెలు చేత్తో తిన్న భోజనం పాపాలను తొలగిస్తుంది, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాసం శుక్లపక్ష రెండో రోజు అన్నాచెల్లెళ్ల పండుగను జరుపుకుంటారు. ఉత్తరాది రాష్ట్రాలలో దీనిని భాయ్ దూజ్ గా జరుపుకుంటారు. సోదరీమణులు సోదరులను ఇంటికి పిలిచి, కడుపునిండా వివిధ రకాల ఆహార పదార్థాలతో భోజనం పెడతారు. భోజనానికి సోదరి ఇంటికి సోదరుడు వెళ్లేటప్పుడు చీర సారెలతో వెళ్లి, ఆమె చేతి భోజనాన్ని తింటారు.
ఈ సంవత్సరం అన్నాచెల్లెళ్ల పండుగ అక్టోబర్ 23న వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ..అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా శుభ సమయం. దీనివలన అన్నకు ఆయురారోగ్యం, ఐశ్వర్యం, విజయము లభిస్తాయి. చెల్లెలు కుటుంబానికి శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. కుటుంబ బంధం బలపడుతుంది, ధర్మానుసారంగా జీవన పథం దృఢమవుతుంది.

