చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు వాదనలు
ఫైబర్ నెట్ కేసులో టిడిపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో నేడు వాదనలు ప్రారంభమయ్యాయి. నిన్న కోర్టు సమయం మించిపోవడంతో పూర్తి స్థాయి వాదనల కోసం నేడు సమయం కేటాయించారు. చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ మాట్లాడుతూ చంద్రబాబుకు టెరాసాఫ్ట్ సంస్థకు టెండర్ ఖరారు విషయంలో సంబంధమే లేదన్నారు. ఆయన అసలు ఈ కమిటీ, టెండర్ అవార్డు కమిటీలలో సభ్యునిగా లేరని తెలియజేశారు. కొందరు విధాన పరమైన నిర్ణయాల అమలులో చేసిన తప్పులకు, ఆర్థిక అక్రమాలకు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును బాధ్యుడిగా చేయడం సరికాదని న్యాయవాది తన వాదనలు వినిపించారు. వైసీపీ ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ అధ్యక్షుడిని కారాగారంలో ఉంచితే రాబోయే ఎన్నికలలో సులభంగా గెలుపు సాధించాలనే దురుద్దేశంతోనే ఇలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. మరోపక్క స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా ఏసీబీ కోర్టులో చంద్రబాబు రిమాండ్, బెయిల్ అంశాలపై వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబును కస్టడీకి అప్పగించాలంటూ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కర్త,కర్మ, క్రియ చంద్రబాబేనంటూ వాదించారు. ఇప్పటి వరకూ చంద్రబాబు ఈ కేసుపై నోరు విప్పలేదంటూ, అందుకే ఇంకా కొన్ని రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించాలంటూ వాదనలు కొనసాగిస్తున్నారు.