‘తెలంగాణ బిడ్డలు నీబిడ్డ లాంటి వారు కాదా కేటీఆర్?’…రేవంత్ రెడ్డి
తన కుమారుడు హిమాన్షును మిస్ అవుతున్నానంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌ను తిప్పి కొట్టారు కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు నీ బిడ్డ లాంటి వారు కారా కేటీఆర్? అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న నీ కొడుకు గుర్తుకు వచ్చి గుండె బరువెక్కుతుందా కేటీఆర్? కొద్ది రోజులకే తల్లడిల్లిపోతున్నావు..అంటూ ట్విట్టర్లోనే ప్రశ్నించారు.
30 మంది ఇంటర్ విద్యార్థులు నీ గ్లోబరీనా కంపెనీ కారణంగా ఉసురు తీసుకున్నారు. కొడుకు చనిపోయి, పదేళ్లుగా ప్రభుత్వ సాయానికి నోచుకోని తెలంగాణ అమర వీరుల సంగతేంది? సర్కారు హాస్టళ్లలో మీరు పెట్టే తిండి తినలేక ఏడుస్తున్న పిల్లలను తలుచుకునే అమ్మానాన్నల ఆవేదన నీలా కాదనుకున్నావా? ఉద్యోగాల కోసం, ఏండ్ల తరబడి ఇంటి మొఖం చూడని… లక్షలాది నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆవేదన నీలా కాదా? అంటూ మండిపడ్డారు. తిండి సరిగ్గా పెట్టక చిన్నారులను, ఫీజుల బకాయిలివ్వకుండా విద్యార్థులను, ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులను వంచించిన మీ సర్కారుకు తల్లిదండ్రుల శాపాలు తగులుతాయంటూ విమర్శించారు.