అమర్‌నాధ్ యాత్రలో అలజడి- రాజాసింగ్ క్షేమం
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాధ్ యాత్రలో తీవ్ర విషాదం జరిగింది. మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా 15 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఆర్మీ పలువురు అనేక మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. అమర్‌నాధ్ లో భారీ కుంభవృష్టి కురిసింది. కొండలపైనుంచి వరద నీరు భారీగా రావడంతో సమీపంలోని గుడారాలతో పాటు భక్తులు కూడా కొట్టుకుపోయారు. 10 మంది చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. ఇప్పటివరకూ ఏడుగురిని కాపాడారు. కుంభవృష్టి సమయంలో 12 వేల మంది భక్తులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సి.ఆర్.పీ.ఎఫ్ బీ.యస్.ఎప్, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరదల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వరద ముంచెత్తిన సమయంలో రాజాసింగ్ సంఘటనా స్థలం నుంచి తీసిన వీడియోను ఆయన మీడియాకు పంపించారు. తాను అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకుని వెళ్లిన పది నిమిషాల్లోనే వరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకున్నామని, అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో గుర్రాలపై వచ్చామని తెలిపారు. ఆకస్మికంగా వరదలు రావడంతో మిగిలిన వారు ఏం చేయలేని పరిస్థితి నెలకొందని, తన కళ్లముందే చాలామంది వరదల్లో కొట్టుకుపోయారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడారని కొనియాడారు. జమ్ము-కాశ్మీర్ అధికార యంత్రాంగం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్స్‌ను ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్‌లో కూడా 9మంది వరద భీభత్సం కారణంగా దుర్మరణం చెందారు. ఈ విపత్తు పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్‌కోవిందులు తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ప్రధాని మోదీ జమ్ము-కాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హాతో మాట్లాడి అక్కడి పరిస్దితిని తెలుసుకున్నారు.