ఆ వాహనాలన్నీ తుక్కుకే..హర్యానా ప్రభుత్వ కీలక నిర్ణయం
దేశంలోని పలు నగరాల్లో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అక్కడ నివసించే ప్రజలు పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాలుష్యం పెరగడానికి గల కారణాలలో పాత వాహనాలు కూడా ఒకటి. వీటి నుంచి వెలువడే పొగతో అనేక విష వాయువులు గాలిలో కలుస్తున్నాయి. దీని పరిష్కారానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా హర్యానా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కాలం చెల్లిన వాహనాలకు పెట్రోలు, డీజిల్ పోయవద్దని పెట్రోలు బంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ కాని, ఆటోమేటెడ్ ఫిట్ నెస్ సెంటర్ల ద్వారా అనర్హమైనవిగా ప్రకటించిన, రిజిస్ట్రేషన్ రద్దు అయిన వాహనాలను ఈఎల్ వీ లుగా పరిగణిస్తారు. ఇవి సాధారణంగా బాగా పాత వాహనాలే అయ్యి ఉంటాయి. చాలామంది అనేక కారణాలతో ఇలాంటి వాహనాలనే వినియోగిస్తున్నారు. అయితే వీటి నుంచి కాలుష్య కారకాలు విపరీతంగా వెలువడుతున్నాయి. పెట్రోలు బంకులకు వచ్చే కాలం చెల్లిన వాహనాలను గుర్తించేందుకు హర్యానా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా పైన పేర్కొన్న నగరాల్లోని ఇంధన కేంద్రాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. బంకుకు కాలం చెల్లిన వాహనం రాగానే ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా నంబర్ ప్లేటు స్కాన్ అవుతుంది. తద్వారా ఆ వాహనం పూర్తి సమాచారం తెలుస్తుంది. దీంతో వాటిని స్వాధీనం చేసుకుని స్క్రాపింగ్ కు తరలిస్తారు. గ్రీన్ మొబిలిటీలో భాగంగా హర్యానా ప్రభుత్వం ఇకపై ప్రస్తుత వాహనాల్లో సీఎన్ జీ వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటో రిక్షాలను మాత్రమే చేర్చాలని ఆదేశించింది. ఈ నిబంధన ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది. అత్యవసర సేవలు, ఢిల్లీ రిజిస్టర్డ్ వాహనాలను మినహాయించి, బీఎస్ 6 కంప్లైంట్ లైట్, మీడియం, హెవీ గూడ్స్ క్యారియర్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తారు. హర్యానా, ఢిల్లీ మధ్య మెరుగైన రాకపోకల కోసం ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి బీఎస్ 6 బస్సులు సుమారు 382 అందుబాటులోకి రానున్నాయి.