బీజేపీ అగ్రనేతలంతా అసెంబ్లీకే… బీజేపీ అధిష్టానం ఆదేశం
బీజేపీ అధిష్టానం తెలంగాణ మీద దృష్టి పెట్టింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ప్రదాని రెండు సార్లు తెలంగాణకు వచ్చి కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించారు. కేసీఆర్, ఎన్డీయేలో చేరతానంటే ఎంఐఎంతో అంటకాగే పార్టీని కలిపుకొనేది లేదని స్పష్టం చేసానని నిజామాబాద్ సభలో ప్రధాని విస్పష్టమైన ప్రకటన చేశారు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి సహకరించమని కోరితే ఇదేం రాచరికం కాదు… అయ్య పోగానే కొడుకు ముఖ్యమంత్రి కావడానికి అని అంగీకరించలేదని ప్రధాని ఇందురులో బాంబు పేల్చారు. దీంతో బీఆర్ఎస్‌లో వచ్చిన కుదుపు ఇంకా సద్దుమణగకముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీనికి తోడు అమిత్ షా కూడా తెలంగాణ కార్యక్షేత్రంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఓపక్క కేసీఆర్‌ను ఇరుకున పెడుతూనే బీజేపీ అంతర్గత సమస్యల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటీ పరిష్కరిస్తోంది.
అగ్రనాయకులందరినీ అసెంబ్లీ బరిలో దింపాలని అదిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు తాజా ఎంపీలు, మాజీ ఎంపీలను సైతం పోటీ చేయించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పటిష్టమైన నాయకులైతే… అంగబలం, అర్థబలంతో బీఆర్ఎస్ నాయకులను సమర్థవంతంగా ఎదుర్కోగలరని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అంబర్ పేట నుండి, ఎంపీ అరవింద్‌ను కోరుట్ల నుండి, మరో ఎంపీ సోయం బాపురావును ఆదిలాబాద్ బోథ్ నుంచి, బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి, మాజీ ఎంపీ వివేక్ ఉమ్మడి కరీంనగర్ నుంచి, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి- మహబూబ్ నగర్, గద్వాల నుంచి డీకే అరుణ, విజయశాంతి- మెదక్ నుంచి, బూర నర్సయ్యగౌడ్ భువనగిరి అసెంబ్లీ నుంచి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి బరిలో దిగబోతున్నారు. పొంగులేటి సుధార్ రెడ్డి-ఖమ్మం నుంచి బరిలో దిగాల్సి ఉంటుంది.
పార్టీలో కీలక పదవులు కాదు.. పార్టీని ఎన్నికల్లో గెలిపించాల్సిందేనంటూ సీనియర్లకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని.. ఎలాంటి ఎక్స్‌క్యూజెస్ అంగీకరించేది లేదని నేతలకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కీలక శక్తిగా ఎదగాలంటే నాయకులందరూ కలిసికట్టుగా ఉండటంతోపాటు, బలమైన అభ్యర్థులంతా ఎన్నికల గోదాలో నిలవాల్సిందేనని పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేద్దాంలే.. అనుకుంటున్న నేతలను సైతం అసెంబ్లీ పోరులోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ముక్కోణపు పోటీ నెలకొని ఉండటంతో గెలుపు ఓటముల మధ్య పెద్దగా తేడా ఉండదని, కష్టపడి పనిచేస్తే విజయం పెద్ద కష్టం కాదని పార్టీ కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. అందుకే అందరినీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని స్పష్టం చేస్తోంది బీజేపీ హైకమాండ్.