NewsTelangana

మునుగోడుకు పోలీసు దండు

మునుగోడు, మనసర్కార్‌: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇక్కడ విజయం సాధించే పార్టీకి రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశాలు మెరుగవుతాయనే టాక్‌ వినిపిస్తుండటంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు గెలుపే లక్ష్యంగా ఎంతకైనా తెగించాలని నిర్ణయించాయి. సీఎం కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మునుగోడులోనే మకాం వేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, ఎత్తుకు పైఎత్తులు, జన సమీకరణాలు, పోలింగ్‌ మేనేజ్‌మెంట్‌.. మొదలైన పనుల్లో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఏ చిన్న సంఘటన జరిగినా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే అవకాశం ఉండటంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. మునుగోడులో పోలీసు బలగాలను భారీ ఎత్తున దించి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డీసీపీ..

యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల నుంచి వందలాది పోలీసుల దండును మునుగోడుకు పంపిస్తున్నారు. ఊరికి ఒక ఎస్సై, మండలానికి ఒక డీసీపీతో పాటు కేంద్ర పోలీసు బలగాలను మోహరించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్క చౌటుప్పల్‌ మండలంలోనే ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 12 మంది సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు.. అంతా కలిపి 400 మందిని దించారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలో 300 మంది విధుల్లో ఉన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా

ఏమండలంలో, ఏ గ్రామంలో చూసినా అడుగడుగునా పోలీసుల బూట్ల చప్పుడే వినిపిస్తోంది. చౌటుప్పల్‌, నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల్లో 48 సున్నిత గ్రామాలను, 104 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన పోలీసులు ప్రత్యేక బలగాలతో నిఘా ఉంచారు. ఎన్నికల సందర్భంగా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పర్యవేక్షిస్తున్నారు. వీరి పనితీరును రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ పరిశీలిస్తున్నారు.