ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన ఒక్కరోజులోనే భారీగా నగదు, బంగారం
తెలంగాణాలో ఎన్నికల తేదీ ప్రకటనతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సమాచారం అందుకుని వివిధ ప్రాంతాలలో సోదాలు ప్రారంభించారు పోలీసులు. నిన్న ఒక్కరోజులోనే భారీగా నగదు, బంగారం లభ్యమయ్యాయి. 15 కిలోల బంగారం, 400 కిలోల వెండి లభ్యమయ్యాయి. హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఈ సొత్తు లభ్యమయ్యింది. అంతేకాక నిజామాబాద్ పరిధిలో 50 లక్షల వరకూ నగదు లభ్యమయ్యింది. మొత్తంగా 8 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం, వెండి, నగదు కలిపి ఈ సోదాలలో లభించాయి. ఏ వాహనంలోనైనా 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే అనుమతి పత్రాలు చూపించాలని పోలీసులు తెలియజేశారు. అంతేకాక మద్యం, ఎన్నికల బహుమతులపై పోలీసులు నిఘా పెట్టారు. అంతేకాక యూపీఐ లావాదేవీల పైనా ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అలాగే 10 లక్షల కంటే ఎక్కువ మొత్తం ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తే కూడా వివరాలను బ్యాంకుల ద్వారా సేకరించే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు ప్రారంభించారు. వాహనాలలో అక్రమ నగదు, మద్యం, బంగారం రవాణాపై నిఘాలు ఏర్పాటు చేశారు.