Home Page SliderNationalPolitics

ఎయిర్ ఇండియా సేవలపై భగ్గుమన్న కేంద్రమంత్రి

ఎయిర్ ఇండియా సేవల డొల్లతనం మరోసారి బయటపడింది. ఏకంగా కేంద్రమంత్రే ఎయిర్ ఇండియాపై ఫైర్ అయ్యారు. ఇటీవల భోపాల్ నుండి ఢిల్లీకి ఎయిర్ ఇండియాలో ప్రయాణించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని, దీనివల్ల కూర్చోవడానికి చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సీట్లు ఆ విమానంలో చాలా ఉన్నాయని పేర్కొన్నారు. తనకు సీటు మారుస్తానని సిబ్బంది చెప్పారని, కానీ తన వల్ల మరో ప్రయాణికుడు ఎందుకు అలాంటి సీట్లో ఇబ్బంది పడాలనే ఉద్దేశంతో తాను అదే సీట్లో కూర్చుని వచ్చానని వెల్లడించారు.  ఎయిర్ ఇండియా ప్రయాణికులను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఎయిర్ లైన్స్ మేనేజ్ మెంట్ ప్రయాణికుల సౌకర్యం, భద్రత గురించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను నిర్వహిస్తున్న విధానం బాగోలేదని, మేనేజ్ మెంట్ మరోసారి ఎవరికీ ఇలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంపై ఎయిర్ ఇండియా స్పందించింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామని హామీ ఇస్తూ రిప్లయ్ ఇచ్చారు.