Breaking Newshome page sliderHome Page SliderTelangana

47 మంది కమిషనర్ల బదిలీ

రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు . ముఖ్యంగా సొంత జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న వారు, ఒకే చోట మూడేళ్లకు పైగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న అధికారులను నిబంధనల ప్రకారం స్థానచలనం కలిగించారు. పరిపాలనా కారణాలతో పాటు పలువురు అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఈ బదిలీల ప్రక్రియను చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే యంత్రాంగాన్ని సిద్ధం చేయడంలో భాగంగా ఈ భారీ ప్రక్షాళన జరిగినట్లు తెలుస్తోంది.

ఈ బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ సి.వి.ఎన్ రాజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా, క్యాతనపల్లి నుంచి జి. రాజు ఆదిలాబాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే నల్గొండ నుంచి ముసాబ్ అహ్మద్ హుజూరాబాద్‌కు, ఆలేరు నుంచి బి. శ్రీనివాస్ హుజూర్‌నగర్‌కు బదిలీ అయ్యారు. పదోన్నతులు పొందిన వారిలో డి. జైత్రమ్ జహీరాబాద్ కమిషనర్‌గా, జీహెచ్‌ఎంసీ నుంచి బి. శరత్ చంద్ర నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని, విధుల్లో చేరడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని జాయింట్ డైరెక్టర్ నారాయణ రావు హెచ్చరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం నెలకొంది.